
కరీంనగర్ క్రైమ్ న్యూస్: దొంగతనం చేసిన ఇంట్లో వేలిముద్రలు దొరకకుండా ఉండేందుకు కారం పొడి చల్లి పోలీసులను తప్పించుకోవాలని ప్రయత్నించిన ఓ దొంగ చివరకు పోలీసులకు చిక్కాడు. ఎంత జాగ్రత్తగా ఆనవాళ్లు చెరిపేసినా సాంకేతిక పరిజ్ఞానం ముందు అతడి ఎత్తులు పనిచేయలేదు. నాట్‌గ్రిడ్ సాంకేతికత సాయంతో నిందితుడిని గుర్తించిన కరీంనగర్ రూరల్ పోలీసులు బొమ్మకల్‌లోని కోకాకోలా దాబా వద్ద అరెస్టు చేశారు.
కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్‌కు చెందిన బాలసాని అజయ్ ఇంటర్ చదువుతున్న సమయంలోనే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. గతంలో మానకొండూరు మండలం ఊటూరు బ్యాంకు దోపిడీ కేసుతో పాటు సుల్తానాబాద్‌లో జరిగిన మూడు దొంగతనాల కేసుల్లోనూ అతడు అరెస్టయ్యాడు.
2025లో హైదరాబాద్‌కు వెళ్లిన అజయ్.. అక్కడి ఏఎంబీ షాపింగ్ మాల్లో కొంతకాలం సేల్స్‌మెన్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రాజుతో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ కలిసి బైక్‌పై శ్రీశైలం వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఓ ఇంటిని అజయ్ లక్ష్యంగా చేసుకున్నాడు. ఇంట్లోకి చొరబడి రెండున్నర తులాల బంగారంతో పాటు కొంత నగదును దొంగిలించాడు. అనంతరం కాశీ వెళ్లాలనే ఉద్దేశంతో కరీంనగర్ చేరుకున్నాడు.
కారం పొడి చల్లినా తప్పని పోలీసుల నిఘా
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ్‌నగర్ కాలనీలో మరో ఇంట్లోకి అజయ్ చొరబడ్డాడు. అక్కడ పావు తులం బంగారం, 25 తులాల వెండిని అపహరించాడు. అయితే తన వేలిముద్రలు పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో ఇంట్లోని కారం పొడిని చల్లి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గత ఆగస్టులో జరిగిన ఈ చోరీ కేసును పోలీసులు సవాలుగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నాట్‌గ్రిడ్ సాయంతో నిందితుడి గుర్తింపు
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. నాట్‌గ్రిడ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి దొంగతనాల వెనుక బాలసాని అజయ్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అతడి ఆచూకీ తెలుసుకుని బొమ్మకల్‌లోని కోకాకోలా దాబా వద్ద అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. వేలిముద్రలు, ఇతర ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్న కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
కారం పొడి చల్లి పోలీసులను తప్పించుకోవచ్చని భావించిన నిందితుడి ప్రయత్నాలు చివరకు విఫలమయ్యాయి. సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
