
D News: Nov 3:బాంబే హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురుదెబ్బ
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు అధికారులు జారీ చేసిన ‘లీవ్ ఇండియా’ (భారత్ విడిచి వెళ్లాలంటూ ఇచ్చిన) నోటీసును సవాలు చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేవలం అఫిడవిట్ దాఖలు చేస్తే సరిపోదని, కోర్టు ముందు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేసింది.
విదేశాల్లో అయితే మరుసటి విమానంలోనే పంపేవారు
విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ తీరుపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారత పౌరులు విదేశాల్లో ఇలాంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే, వారిని మరుసటి విమానంలోనే భారత్‌కు పంపించేవారని వ్యాఖ్యానించింది. ఇన్నేళ్లుగా భారత్‌లో నివసిస్తున్న ఆయన ఇప్పటివరకు ఎలాంటి నిరసనల్లో పాల్గొనకుండా, అకస్మాత్తుగా ఇప్పుడు ఎందుకు ఆందోళనల్లో పాల్గొన్నారని ప్రశ్నించింది.
ఓసీఐ నిబంధనల ఉల్లంఘనపై హెచ్చరిక
ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్.. ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడని, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డు కలిగి ఉన్నందున ఆయనకు పరిమిత హక్కులు మాత్రమే ఉంటాయని కోర్టుకు వివరించారు. భారత పౌరుల మాదిరిగా రాజకీయ, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు ఆయనకు లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉందని, నిరసన ఉద్దేశం తెలిసే ఉద్దేశపూర్వకంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని వాదించారు.
నిరసన నిర్వాహకులతో సంబంధం లేదు: ఇమ్రాన్ తరఫు న్యాయవాది
మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. నిరసన కార్యక్రమ నిర్వాహకులతో నటుడికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని తెలిపారు. భారత్‌లో నివసించేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే, ఈ వాదనలతో ఏకీభవించని న్యాయస్థానం కేవలం అఫిడవిట్ దాఖలు చేయడం సరిపోదని, బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది.
