D News: Oct 31: నకిలీ ఆధార్, పాన్ కార్డుల తయారీ.. వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: ఆధార్, పాన్ కార్డుల్లో పేర్లు, ఫొటోలు, పుట్టిన తేదీలు, చిరునామాలను అక్రమంగా మార్చి నకిలీ పత్రాలు తయారు చేస్తున్న వ్యక్తిని శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. రాజేంద్రనగర్‌లోని శంషాబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్ డి. కృష్ణమోహన్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

జల్‌పల్లికి చెందిన మహదేవ్ (36) బుద్వేల్‌లో ‘కవిత ఏ టు జెడ్ ఆన్‌లైన్ సర్వీసెస్’ పేరుతో జిరాక్స్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే, వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఆధార్, పాన్ కార్డుల్లోని వ్యక్తిగత వివరాలను అక్రమంగా మార్చి నకిలీ కార్డులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

మార్పులకు ప్రత్యేకంగా ధరల నిర్ణయం

కార్డుల్లో పుట్టిన తేదీని మార్చేందుకు రూ.300, పూర్తి వివరాలను మార్చేందుకు రూ.700 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ విధంగా తయారు చేసిన నకిలీ కార్డులను కొందరు ప్రైవేటు ఉద్యోగాలు పొందేందుకు, సిమ్ కార్డులు తీసుకునేందుకు, ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

60 నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం

విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నిందితుడిపై నిఘా పెట్టి అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 60 నకిలీ ఆధార్ కార్డులు, రెండు పాన్ కార్డులు, ల్యాప్‌టాప్, ప్రింటర్, లామినేషన్ యంత్రం, మొబైల్ ఫోన్‌తో పాటు రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల నిమిత్తం పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు.

ఈ దాడులు, అరెస్టు కార్యక్రమంలో ఎస్‌ఐలు ఎస్. శేషు, కె. మన్సూర్ అలీ, ఎన్. నర్సింగరావుతో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, పహాడీషరీఫ్ పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *