
D Educt: Oct 31: పాలిటెక్నిక్ ఫస్టియర్ విద్యార్థులకు ఇకపై వార్షిక పరీక్షలు
తెలంగాణ: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ఫస్టియర్ విద్యార్థులకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి సెమిస్టర్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తూ వచ్చింది. అయితే ఈ విధానంలో మార్పులు తీసుకువస్తూ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఇటీవల ఆమోదం తెలిపారు.
పాలిటెక్నిక్ కోర్సులో చేరిన నాలుగున్నర నెలలకే పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా తెలుగు మాధ్యమంలో చదివి పాలిటెక్నిక్‌లో చేరిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాయాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు పరీక్షలకు తగిన సమయం కల్పించాలనే ఉద్దేశంతో సెమిస్టర్ విధానాన్ని మార్చి వార్షిక పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
ఈ నిర్ణయం ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 8 నుంచి 17వ తేదీ వరకు పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థులకు సబ్జెక్టులను పూర్తిస్థాయిలో అభ్యసించి పరీక్షలకు సిద్ధమయ్యేందుకు మరింత సమయం లభించనుంది.
