
D NEWS: ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. అవసరమైతే సంస్థకు చెందిన విలువైన భూములను విక్రయించి అయినా బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
ఇటీవల జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించిన ఐక్య కూటమి ప్రతినిధులు మంత్రిని కలిశారు. ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ ప్రతినిధులను పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి మిఠాయిలు తినిపించారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు కీలక స్థానం ఉందని మంత్రి పేర్కొన్నారు. కార్మిక సంఘాల తరహాలో విద్యాసంస్థల్లోనూ విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ఎన్నికల ద్వారా ఏర్పడే నాయకత్వం ఉపయోగపడుతుందని తెలిపారు.
ఆర్టీసీ విలీన ప్రక్రియపై అధికారులు, కార్మిక సంఘాల నాయకులు చర్చించి కార్యాచరణ రూపొందించాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో విలీన సమయంలో ఎదురైన సమస్యలను అధ్యయనం చేసి, తెలంగాణలో అలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూ సంస్థ అభివృద్ధికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన సీసీఎస్ బకాయిల చెల్లింపుపైనా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా పాత బకాయిల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కార్మికులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
