D NEWS: విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల హక్కుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతిపాదిత రోహిత్ వేముల తెలంగాణ బిల్లు ముసాయిదాను మూడు నెలల్లో సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ముసాయిదాను సీనియర్ సివిల్ సర్వెంట్ల కమిటీకి సమర్పించాలని సూచించారు.

తెలంగాణ సచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ రెండో సమావేశం జరిగింది. బిల్లు రూపకల్పన, కమిటీల ఏర్పాటు, న్యాయపరమైన అంశాలపై చర్చించారు. అలాగే, వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి ముసాయిదా రూపొందించాలని నిర్ణయించారు.

విద్యార్థులు, అధ్యాపకులు, న్యాయ నిపుణులు, పౌర సమాజ సంస్థలు, విద్యారంగ నిపుణుల సూచనలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. బిల్లు రూపకల్పనకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ నాయకత్వం వహించాలని ఆదేశించారు. మరోవైపు, న్యాయశాఖను కమిటీలో సభ్య శాఖగా చేర్చాలని సూచించారు.

విద్యాశాఖ, హోంశాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వంటి సంస్థల భాగస్వామ్యాన్ని కూడా పరిశీలించనున్నారు. న్యాయపరమైన, సాంకేతిక అంశాలపై నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం సహకారం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో బిల్లు రూపకల్పనలో నిపుణుల సూచనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

కులం, సామాజిక నేపథ్యం ఆధారంగా విద్యార్థులు వివక్షకు గురికాకుండా చర్యలు తీసుకోవడం ఈ ప్రతిపాదిత బిల్లు లక్ష్యాల్లో ఉంది. విద్యాసంస్థల్లో సమాన అవకాశాలు, న్యాయబద్ధమైన వాతావరణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టనున్నారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉన్నతాధికారులు, న్యాయవాది దిశా వడేకర్ పాల్గొన్నారు.