D NEWS: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నీటి పొదుపును ప్రజా ఉద్యమంగా చేపట్టాలని శుక్రవారం విడుదల చేసిన బహిరంగ లేఖలో సూచించారు.

రాష్ట్రంలో జలాశయాల నీటి నిల్వలు తగ్గుతున్నాయని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం సాధారణంగా 460 టీఎంసీల నీరు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 209 టీఎంసీలే ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో తాగునీరు, వ్యవసాయ అవసరాలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని వివరించారు.

గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్, ఇతర పట్టణాల్లో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, రైతులకు తక్కువ నీటితో సాగు చేసే పంటలపై అవగాహన కల్పించాలని కాంగ్రెస్ శ్రేణులను కోరారు. ప్రత్యామ్నాయ పంటలు, విత్తనాల లభ్యత, పంట బీమా, ప్రభుత్వ సహాయంపై వివరించాలని తెలిపారు.

వర్షాభావ పరిస్థితుల్లో బోర్లపై ఆధారపడటం పెరిగితే భూగర్భజలాలు తగ్గే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో విద్యుత్ వినియోగం, సాగు ఖర్చులు కూడా పెరగవచ్చని వివరించారు. రాష్ట్ర విద్యుత్ పీక్ డిమాండ్ 20 వేల మెగావాట్లు దాటినట్లు నివేదికలు వెల్లడించాయని లేఖలో ప్రస్తావించారు.

ప్రతి జిల్లా, మండల, గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు నీటి నిల్వలు, తాగునీటి అవసరాలు, రైతుల పరిస్థితులను సమీక్షించాలని మహేశ్‌కుమార్ గౌడ్ కోరారు. నీటి వృథాను అరికట్టడంతో పాటు వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు తాగునీరు, పశువులకు నీరు, మేత అందించడంతో పాటు పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.