D Spiritual: Oct 17: వర్గల్ విద్యా సరస్వతి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. మహాలక్ష్మి దేవి అలంకారంలో అమ్మవారు

వర్గల్ శ్రీ విద్యా సరస్వతి క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన శనివారం శ్రీ విద్యా సరస్వతి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సమస్త ప్రజలకు సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శుభప్రదమైన భవిష్యత్తును ప్రసాదించే తల్లిగా మహాలక్ష్మి దేవిని భక్తులు ఆరాధిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా గణపతి పూజ, సుప్రభాతం, విశేషాభిషేకం, గిరి ప్రదక్షిణ, అమ్మవారి అలంకారం, పంచహారతులు, చతుష్షష్ట్యుపచార పూజలు, రాజోపచార పూజలతో పాటు చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాల నడుమ జరిగిన ఈ పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

అనంతరం ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలతో పాటు మహాప్రసాదాన్ని అందజేశారు. భక్తిశ్రద్ధలతో సాగిన శరన్నవరాత్రి ఉత్సవాలతో వర్గల్ శ్రీ విద్యా సరస్వతి క్షేత్రం భక్తజన సందోహంతో సందడిగా మారింది.