
D Spiritual: Oct 16: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శుక్రవారం అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ పవిత్రమైన రోజున జ్ఞాన ప్రదాయిని అయిన శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై అర్ధరాత్రి 12.49 గంటలకు దుర్గమ్మ దర్శనం ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక పెరగడంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు జనసంద్రంగా మారాయి.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు అన్ని రకాల సిఫార్సు దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఉచిత దర్శనానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మూడు ప్రాంతాల్లో హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి, ఐదంచెల భద్రత నడుమ భక్తులను క్రమపద్ధతిలో క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు.
జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, విధుల్లో ఉన్న సిబ్బందికి తగిన సూచనలు జారీ చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు, భద్రతా చర్యలను సమన్వయంతో నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా, నేడు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అశ్వయుజ శుద్ధ సప్తమి, మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని శ్రీ సరస్వతీ దేవి రూపంలో పూజించడం విశేషం. ఈ రోజున అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల విద్య, జ్ఞానం, బుద్ధికుశలత సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
మరోవైపు, శ్రీశైల మహాక్షేత్రంలోనూ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజున శ్రీ భ్రమరాంబికా దేవి కాత్యాయనీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
