D NEWS: పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీసీ సెల్ సమావేశంలో తమకు సమాచారం ఇవ్వలేదని గంట రాములు యాదవ్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదం మొదలైంది.

ఎమ్మెల్సీ ఎల్. రమణ, దాసోజు శ్రవణ్ తదితరులు హాజరైన ఈ సమావేశంలో దాసరి వర్గం, గంట వర్గం మధ్య మాటామాటా పెరిగినట్లు సమాచారం. పరిస్థితి తోపులాటకు దారితీయడంతో కుర్చీలు ధ్వంసమయ్యాయని, ఒకరికి గాయాలయ్యాయని తెలిసింది.

ఈ ఘటనపై గంట రాములు యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీసీ నాయకుడు ఎమ్మెల్యే కాకూడదనే కుట్రతోనే తమపై దాడి చేయించారని, బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ విషయాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష కూడా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీరుపై విమర్శలు చేశారు. సమావేశానికి తనను పిలవకపోవడాన్ని ప్రశ్నించినందుకే దాడి జరిగిందని ఆమె ఆరోపించారు. పెద్దపల్లిలో బీసీ నాయకులు నిర్ణయాత్మక శక్తిగా ఉంటారని పేర్కొన్నారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఒకే పార్టీకి చెందిన నాయకుల మధ్య జరిగిన ఈ ఘర్షణ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అంతర్గత విభేదాలు, బీసీ నాయకత్వంపై అసంతృప్తి, వర్గాల మధ్య ఆధిపత్య పోరు అంశాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ పరిణామం బీఆర్ఎస్ అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం.