D NEWS: మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న ఎర్రవల్లి గ్రామ భూ సర్వే నివేదిక సిద్ధమైనట్లు సమాచారం. రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖల నుంచి వచ్చిన నివేదికను జిల్లా కలెక్టర్ హైమావతి ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

ఎర్రవల్లి సర్వే నంబర్ 325లోని 388 ఎకరాలతో పాటు వెలికట్టలోని సర్వే నంబర్ 271లో అధికారులు భూ సర్వే నిర్వహించారు. ఆయా భూముల్లోని 244 మంది, 118 మంది అనుభవదారులకు అధికారులు నోటీసులు జారీ చేసి పొజిషన్ సర్వే చేపట్టారు.

భూ సర్వే సమయంలో ఎర్రవల్లి శివారులోని వెంకటాపూర్ గ్రామస్థులు లేవనెత్తిన అభ్యంతరాలు, విజ్ఞప్తులను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్న చర్చ స్థానికంగా కొనసాగుతోంది. అయితే ఈ అంశంపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

మార్కుక్ మండల పరిధిలోని భూముల లెక్కలు తేల్చాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. భారీ బందోబస్తు మధ్య ఎర్రవల్లి, వెలికట్ట ప్రాంతాల్లో భూముల సర్వే ప్రక్రియను పూర్తి చేశారు.

ప్రభుత్వానికి సమర్పించనున్న నివేదికలో ఎలాంటి అంశాలు పొందుపరిచారనే దానిపై ఆసక్తి నెలకొంది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.