
D NEWS: టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం పేరు మారినంత మాత్రాన పార్టీ సిద్ధాంతం, ఆలోచనా విధానం, నాయకత్వం, ప్రజల పట్ల ఉన్న అంకితభావం మారవని స్పష్టం చేశారు.
తాను షారుఖ్ ఖాన్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన షారుఖ్ ఖాన్ అయిపోనని కేటీఆర్ ఉదాహరణగా చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే ఉద్దేశంతోనే పార్టీ పేరును మార్చామని వివరించారు.
తెలుగు సినిమాలు పాన్-ఇండియా స్థాయికి వెళ్లి విజయాలు సాధిస్తున్నప్పుడు, తెలుగు నేలపై పుట్టిన రాజకీయ పార్టీ జాతీయ స్థాయికి ఎందుకు వెళ్లకూడదని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ పార్టీ భావజాలాన్ని విస్తరించాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీపై కూడా కేటీఆర్ విమర్శలు చేశారు. ప్రజా సమస్యలు, ఉద్యోగాల కల్పన, ఎన్నికల హామీల అమలుపై చర్చించకుండా మతపరమైన అంశాలను తెరపైకి తీసుకొస్తున్నాయని ఆరోపించారు. ఈసీ విశ్వసనీయతపై కూడా ప్రశ్నలు ఉన్నాయని, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని కోరారు.
తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదని, ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
