
D Spiritual: Sept 30: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న శరన్నవరాత్రి దసరా మహోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆహ్వానించారు. ఈ మేరకు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసి దసరా ఉత్సవాల అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా వేదపండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను చంద్రబాబుకు అందజేశారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి: సీఎం
దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను స్వీకరించిన అనంతరం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఏర్పాట్ల పురోగతిపై సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, క్యూలైన్లు, ఇతర మౌలిక సదుపాయాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కనీస సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో దుర్గగుడి ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో శీనా నాయక్తో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
