
D News : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. తాజాగా జరీనా వహబ్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ గ్లింప్స్‌లో జరీనా వహబ్ చెప్పిన భావోద్వేగ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆకలి కారణంగా మనిషి ఎదుర్కొనే పరిస్థితులను ఆమె పాత్ర ద్వారా చూపించారు. ఆకలి ముందు సిగ్గు, మానం, మర్యాద కూడా ఎలా ఓడిపోతాయనే భావనను ఆమె డైలాగ్స్‌లో బలంగా చూపించారు. దీంతో సినిమాలో పూరి జగన్నాథ్ మార్క్ డైలాగ్స్, ఎమోషన్‌కు ప్రాధాన్యం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్లోనూ పేదరికం, కష్టాలతో కూడిన జీవితాలను ప్రతిబింబించే సన్నివేశాలు కనిపించాయి. తాజాగా వచ్చిన జరీనా వహబ్ గ్లింప్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.
ఈ చిత్రానికి రమీ సంగీతం అందిస్తున్నారు. ఛార్మి కౌర్ సమర్పణలో పూరి కనెక్ట్స్, జె.బి. మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోళ్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్తా మీనన్ నటిస్తుండగా.. టబు, దునియా విజయ్, బ్రహ్మాజీ, వి.టి.వి. గణేష్, విష్ణు రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
