D Educt: Sept 28: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) 2026 టైర్-1 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడతల వారీగా విడుదల చేస్తోంది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 30, 2026 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

అభ్యర్థుల పరీక్ష తేదీకి 2 నుంచి 3 రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 30న జరిగే పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను సెప్టెంబర్ 27న, అక్టోబర్ 1న జరిగే పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను సెప్టెంబర్ 28న విడుదల చేశారు.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 12,256 గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీ కోసం SSC CGL 2026 టైర్-1 పరీక్షను నిర్వహిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు తమ రెజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ కావచ్చు.

లాగిన్ అయిన తర్వాత అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ, షిఫ్ట్ సమయం తదితర వివరాలను సరిచూసుకోవాలి. అనంతరం అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటౌట్ తీసుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షకు హాజరయ్యే సమయంలో అడ్మిట్ కార్డుతో పాటు అవసరమైన గుర్తింపు పత్రాలను వెంట తీసుకెళ్లాలని తెలిపారు.