
D NEWS: తెలంగాణ సచివాలయంలో సోమవారం రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఏళ్ల తరబడి సేవలందించి రిటైర్ అయినా తమకు రావాల్సిన బెనిఫిట్స్ ఇంకా అందలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ చెల్లింపుల కోసం అధికారులను సంప్రదిస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదని తెలిపారు. డిప్యూటీ సీఎం లేదా ఆర్థిక శాఖ ఉన్నతాధికారిని కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు.
పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లులు విడుదల కాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాంట్రాక్టర్లు తెలిపారు. తమకు రావాల్సిన మొత్తాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. బిల్లుల కోసం పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో భట్టి విక్రమార్క ఛాంబర్ వైపు వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు, భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం, నెట్టివేత చోటుచేసుకోవడంతో సచివాలయంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల బకాయిలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆందోళనకారులు కోరారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని త్వరగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
