D NEWS: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆస్తులపై ఈడీ వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం వద్ద భారీగా ఆందోళన నిర్వహించారు.

గతంలో పొంగులేటి ఆస్తులపై ఈడీ సోదాలు జరిగాయని బీఆర్‌ఎస్‌ నేతలు గుర్తుచేశారు. అయితే సోదాల తర్వాత ఇప్పటివరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

ఈ నిరసనలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్, శంభీపూర్ రాజుతో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోదాలు నిర్వహించిన అధికారులు తదుపరి చర్యలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని వారు నిలదీశారు.

ఈడీ కార్యాలయంలోకి వెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నించారు. అయితే అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం తోపులాట చోటుచేసుకోవడంతో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

పొంగులేటి ఆస్తులపై ఈడీ విచారణకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్ చేశారు. గతంలో జరిగిన సోదాలపై తదుపరి చర్యలు ఏమిటో స్పష్టత ఇవ్వాలని కోరారు.