
D News : చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ‘హనుమాన్ అంశ్’ పేరు కూడా చేరింది. కేవలం రూ.1.5 కోట్లకు కొద్దిగా ఎక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.360 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏడు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్నా.. సినిమా వసూళ్ల జోరు కొనసాగుతున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ‘హనుమాన్ అంశ్’కు దర్శకత్వం వహించిన విశాల్ చతుర్వేది సినిమా నిర్మాణ సమయంలో ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. అయితే సినిమా అంచనాలకు మించి విజయం సాధించడంతో ఇప్పుడు ఆయనకు భారీ మొత్తంలో లాభం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
14 ఏళ్ల కలకు ఫలితం
‘హనుమాన్ అంశ్’ కథను తెరకెక్కించేందుకు విశాల్ చతుర్వేది దాదాపు 14 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారని నిర్మాత అనుప్రియా నగర్ తెలిపారు. గతంలో పలువురు ఓటీటీ సంస్థలకు కథను వినిపించినప్పటికీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని ఆమె వెల్లడించారు.
చివరకు సహ నిర్మాతలు రాగిణి సోనా, నమ్రతా సింగ్ కథపై నమ్మకం ఉంచడంతో సినిమా నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు. బడ్జెట్ పరిమితంగా ఉండటంతో దర్శకుడు తన పారితోషికాన్ని తీసుకోకుండా సినిమాను పూర్తి చేశారని చెప్పారు.
రూ.50 కోట్ల వరకు వచ్చే ఛాన్స్?
సినిమా థియేట్రికల్ రన్ అంచనాలకు మించి కొనసాగుతుండటంతో నిర్మాతగా తనకు దాదాపు రూ.50 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అనుప్రియా అభిప్రాయపడ్డారు. అయితే ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ హక్కుల డీల్స్ ఇంకా పూర్తికాలేదని ఆమె తెలిపారు.
ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్క్ లెక్కల ప్రకారం.. ‘హనుమాన్ అంశ్’ 47 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.366.45 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దర్శకుడికి కూడా లాభాల్లో వాటా దక్కే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
వచ్చిన ఆదాయంతో ఏం చేస్తారంటే?
సినిమా నుంచి ఇంత భారీ ఆదాయం వస్తుందని తాము ఊహించలేదని అనుప్రియా తెలిపారు. వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఉపయోగించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.
అంతేకాకుండా సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించి.. భవిష్యత్తులో మరిన్ని మంచి కథలను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు అనుప్రియా వెల్లడించారు. దీంతో ‘హనుమాన్ అంశ్’ విజయం నిర్మాతలకు మాత్రమే కాకుండా.. సినిమా కోసం ఫీజు తీసుకోకుండా పనిచేసిన దర్శకుడికి కూడా భారీగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది.
