Bigg Boss Telugu 10: Major Wild Card Twist, One Among Three Gets a Chance to Enter the House

D News : బిగ్ బాస్ తెలుగు 10లో 18వ రోజు ఆసక్తికర పరిణామాలతో సాగింది. ఒకవైపు కెప్టెన్సీ కంటెండర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు ‘అగ్ని పరీక్ష’ నుంచి వచ్చిన ముగ్గురితో బిగ్ బాస్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. వారిలో ఒకరికి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించారు.

కెప్టెన్సీ టాస్క్‌లో గందరగోళం

కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో భాగంగా బజర్ రౌండ్ జరిగింది. వంశీ, నరేష్ మధ్య జరిగిన పోటీలో ముందుగా ఎవరు బజర్ నొక్కారనే విషయంలో సంచాలక్ త్రిగుణ్ మొదట నరేష్ పేరు చెప్పాడు. అయితే కొద్దిసేపటికే తన నిర్ణయాన్ని మార్చుకుని వంశీ ముందుగా బజర్ నొక్కాడని ప్రకటించాడు.

తాను గందరగోళానికి గురయ్యానని త్రిగుణ్ అంగీకరించడంతో నరేష్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ తర్వాత జరిగిన మరో బజర్ రౌండ్‌లో ఝాన్సీ ముందుగా బజర్ నొక్కడంతో ఆమె కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచింది. దీంతో ముఖేష్, అమన్, సృష్టి, ఝాన్సీ కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు.

ముగ్గురి కామెంట్లతో హౌస్‌లో చర్చ

ఆ తర్వాత బయట నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలను బిగ్ బాస్ హౌస్‌లో ప్రదర్శించారు. ముఖేష్, షాలిని, రామ్ ప్రసాద్, వర్షిణి ఆటతీరుపై పలు విమర్శలు వినిపించాయి. ముఖేష్ ఆటపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం లేదని, షాలిని ఇప్పటివరకు గేమ్‌లో ప్రత్యేకంగా రాణించలేదని వ్యాఖ్యలు వచ్చాయి.

రామ్ ప్రసాద్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడనే కామెంట్ కూడా కనిపించగా.. వర్షిణి విషయంలో ఆట కంటే హంగామాకే ప్రాధాన్యత ఇస్తోందనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరనే విషయాన్ని బిగ్ బాస్ వెల్లడించడంతో హౌస్ సభ్యులకు మరో షాక్ తగిలింది. ‘అగ్ని పరీక్ష’లో పాల్గొన్న మిథిలేష్, అపూర్వ, రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు.

ముగ్గురిలో ఒక్కరికే ఛాన్స్

అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. మిథిలేష్, అపూర్వ, రామకృష్ణ బిగ్ బాస్ హౌస్ గేటు వద్దకు వచ్చారు. ఈ ముగ్గురిలో ఒక్కరికి మాత్రమే హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ ప్రకటించాడు.

అయితే ఎవరిని వైల్డ్ కార్డు కంటెస్టెంట్‌గా తీసుకోవాలనే నిర్ణయాన్ని బిగ్ బాస్ స్వయంగా తీసుకోలేదు. ఇప్పటికే హౌస్‌లో ఉన్న సభ్యులే ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేయాలని చెప్పాడు.

ముగ్గురూ తమ గురించి, హౌస్‌లోకి అవకాశం వస్తే తమ ఆట ఎలా ఉంటుందనే విషయాలను సభ్యులకు వివరించారు. మిథిలేష్ తన గత వ్యాఖ్యలపై కూడా వివరణ ఇచ్చాడు. ముఖేష్, త్రిగుణ్, రామ్ ప్రసాద్ గురించి చేసిన కామెంట్లు తనవేనని స్పష్టం చేశాడు. ముఖ్యంగా త్రిగుణ్ ఆటతీరుపై మిథిలేష్ చేసిన వ్యాఖ్యలు హౌస్‌లో చర్చకు దారితీశాయి.

ఇక ఇప్పుడు మిథిలేష్, అపూర్వ, రామకృష్ణలో ఎవరికి హౌస్‌లోకి వెళ్లే అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. హౌస్ సభ్యుల ఓట్ల ఆధారంగా తుది ఎంపిక జరగనుండటంతో.. ఎవరికి ఎక్కువ మద్దతు లభిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ఎపిసోడ్‌లో ఈ ముగ్గురిలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరిదో తేలనుంది.

By Avinash