బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘లవ్ అండ్ వార్’. విక్కీ కౌశల్, అలియా భట్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా చిత్రబృందం రణ్‌బీర్ కపూర్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసింది.

‘హోదా.. గంభీరత్వం.. తపన.. ప్రేమతో పాటు యుద్ధం కూడా’ అనే ఆసక్తికరమైన వ్యాఖ్యలతో ఈ పోస్టర్లను సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో సినిమాలో రణ్‌బీర్ పోషిస్తున్న పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.

జనవరి 21న థియేటర్లలోకి..

ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ‘లవ్ అండ్ వార్’ వచ్చే ఏడాది జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. రొమాంటిక్ అంశాలతో పాటు వార్ డ్రామాను మేళవిస్తూ సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కాగా, ఈ నెల ప్రారంభంలోనే సినిమా ప్రధాన చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. అయితే కొన్ని కీలకమైన యుద్ధ సన్నివేశాలను మరింత భారీగా తీర్చిదిద్దేందుకు తారాగణంతో రీషూట్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రణ్‌బీర్, అలియా, విక్కీ కౌశల్ కాంబినేషన్‌తో పాటు భన్సాలీ దర్శకత్వం కావడంతో ‘లవ్ అండ్ వార్’పై అంచనాలు మరింత పెరిగాయి.