12 ఏళ్ల వయసులో ఎదురైన ఓ చేదు అనుభవం.. ఆ బాలిక జీవితాన్నే మార్చేసింది. తనను తాను కాపాడుకోవాలంటే బలంగా మారాలని నిర్ణయించుకున్న ఆమె.. జూడోలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో క్రీడలు, గాయాలు, ఓటములు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. చివరకు 36 ఏళ్ల వయసులో భారత క్రీడా చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించింది. ఆమెనే సుచికా తరియాల్.

2026 ఆసియా క్రీడల్లో మహిళల 60 కిలోల విభాగంలో మంగోలియాకు చెందిన అల్టాంచిమెగ్ బైగాల్మాను 2-0తో ఓడించి సుచికా సెమీఫైనల్‌కు చేరుకుంది. అక్కడ సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో జరిగిన పోరు నిర్ణీత సమయం తర్వాత కూడా సమంగా ముగిసింది. బరువు ఆధారంగా విజేతను నిర్ణయించడంతో సుచికాకు ఫైనల్ చేరే అవకాశం కోల్పోయింది. దీంతో ఆమె కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.

అయితే ఆ కాంస్యం సాధారణ పతకం కాదు. ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా సుచికా చరిత్ర సృష్టించింది.

జూడో నుంచి ఎంఎంఏ వరకు..

తనను తాను రక్షించుకోవాలనే ఉద్దేశంతో చిన్న వయసులో జూడో నేర్చుకున్న సుచికా.. ఆ క్రీడలో 8 సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. 2019 కామన్వెల్త్ జూడో ఛాంపియన్‌షిప్స్, అదే ఏడాది సౌత్ ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది.

ఆ తర్వాత కురాష్, జుజిట్సు వైపు అడుగులు వేసింది. 2024 జీజేఐఎఫ్ జుజిట్సు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించింది. ఇదే సమయంలో ఎంఎంఏలోనూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. 2024లో ప్రొఫెషనల్ పోటీల్లోకి తిరిగి వచ్చి ఆసియా ఎంఎంఏ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించింది.

ఎన్నో అడ్డంకులు.. అయినా ఆగని ప్రయాణం

సుచికా కెరీర్‌లో ఆర్థిక సమస్యలు, గాయాలు, అవకాశాల కొరత వంటి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు కొన్నిసార్లు సొంత డబ్బును ఖర్చు చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ క్రీడను వదిలిపెట్టలేదు. ఒక క్రీడ నుంచి మరో క్రీడకు మారుతూ తన లక్ష్యాన్ని కొనసాగించింది.

ఒకప్పుడు తనను తాను రక్షించుకోవడానికి బలంగా మారాలని నిర్ణయించుకున్న ఆ 12 ఏళ్ల బాలిక.. 24 ఏళ్ల తర్వాత దేశానికి చారిత్రాత్మక పతకాన్ని అందించింది. సుచికా తరియాల్ ప్రయాణం ఒక్క పతకం కథ కాదు.. ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ తన కలను సాకారం చేసుకున్న పోరాటానికి ప్రతీక.