
D News : నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో పాటు.. రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ హైప్‌కు తగ్గట్టుగానే ప్రీమియర్ షోల నుంచే సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 23 రాత్రి దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ప్రీమియర్ షోలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇండియా వైడ్‌గా కేవలం ప్రీమియర్స్ ద్వారానే ‘ది ప్యారడైజ్’ సుమారు రూ.12.8 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. నాని కెరీర్లో ప్రీమియర్స్ పరంగా ఇది అత్యధిక ఓపెనింగ్గా నిలిచినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలుగు వెర్షన్‌కు ముఖ్యంగా పలు ప్రాంతాల్లో భారీ ఆక్యుపెన్సీ నమోదైనట్లు సమాచారం. నాని మాస్ లుక్, శ్రీకాంత్ ఓదెల టేకింగ్‌పై ఉన్న ఆసక్తి, ప్రీమియర్ టికెట్ రేట్లు వంటి అంశాలు ఈ వసూళ్లకు కారణాలుగా నిలిచినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లోనూ ప్రీమియర్ షోలకు మంచి స్పందన లభించింది.
సినిమాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించగా.. రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఒక్క రాత్రి ప్రీమియర్స్‌తోనే దాదాపు రూ.13 కోట్లకు చేరువైన గ్రాస్ సాధించినట్లు చెబుతున్న ‘ది ప్యారడైజ్’.. ఫస్ట్ డే పూర్తయ్యే సమయానికి ఎలాంటి వసూళ్లు నమోదు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
