
D News : కోలీవుడ్‌లో భారీ సినిమాల రిలీజ్ క్లాష్‌పై ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ధనుష్ హీరోగా, మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ‘ఓఎమ్: చాప్టర్ 1’ (OM: Chapter 1) విడుదల వాయిదా పడింది. ముందుగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా.. రజనీకాంత్ ‘జైలర్ 2’తో పాటు సూర్య ‘సీన్’ సినిమాలతో క్లాష్ కాకుండా రిలీజ్ ప్లాన్‌ను మార్చుకుంది.
రజినీ కోసం రిలీజ్ మార్చిన ధనుష్
‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో తమ సినిమా ఒక్కరోజు తర్వాత విడుదల కావాల్సి ఉండటంతో ధనుష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రజనీకాంత్‌పై ఉన్న గౌరవంతో ‘ఓఎమ్’ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
సూర్య ‘సీన్’తోనూ క్లాష్ లేదు
దీపావళి సీజన్‌లోనూ ‘ఓఎమ్’ను విడుదల చేయడం లేదని ధనుష్ స్పష్టం చేశారు. సూర్య నటిస్తున్న ‘సీన్’ చిత్ర విడుదల తేదీని ముందుగానే ప్రకటించినందున, అదే సమయంలో తమ సినిమాను తీసుకురావడం సరికాదని ఆయన పేర్కొన్నారు. భారీ చిత్రాల మధ్య పరస్పర అవగాహన, గౌరవం ఉండాలని, సినిమా పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ధనుష్ తన ప్రకటనలో వెల్లడించారు.
ధనుష్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఓఎమ్’కు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమా కొత్త విడుదల తేదీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
