
D Educt: Sept 23: మెంతి కూర తెచ్చిన విద్యార్థికి రూ.50 జరిమానా
మహారాష్ట్రలోని ఠాణె జిల్లా భాయందర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన వివాదాస్పదంగా మారింది. జైనుల పవిత్ర పండుగ ‘పర్యూషన్’ సందర్భంగా విద్యార్థులు మెంతి కూర వంటి ఆకుకూరలను టిఫిన్ బాక్సుల్లో తీసుకురావడాన్ని పాఠశాల యాజమాన్యం నిషేధించింది. నిబంధనలను ఉల్లంఘించి మెంతి కూర తెచ్చిన ఓ విద్యార్థికి రూ.50 జరిమానా విధించినట్లు సమాచారం.
పర్యూషన్ పండుగ రోజుల్లో జైనుల ఆచారాల ప్రకారం ఆకుకూరలు, దుంపకూరలకు సంబంధించిన కొన్ని ఆహార నియమాలను పాటిస్తారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆకుకూరలతో చేసిన వంటకాలను పాఠశాలకు తీసుకురావద్దని యాజమాన్యం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇళ్ల నుంచి తెచ్చుకునే ఆహారానికి బదులుగా పాఠశాల క్యాంటీన్‌లో రూ.20 చెల్లించి నిర్దేశించిన ఆహారాన్ని తీసుకోవాలని విద్యార్థులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.
సోషల్ మీడియాలో విమర్శలు
ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్థుల వ్యక్తిగత ఆహారపు అలవాట్లపై మతపరమైన నిబంధనలను ఎలా అమలు చేస్తారని పలువురు ప్రశ్నించారు. పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా పాఠశాల నిర్ణయాన్ని విమర్శించాయి.
విద్యార్థుల ఆహార స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఇటువంటి నిబంధనలు విధించడం సరికాదని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. లంచ్ బాక్సులను తనిఖీ చేసి జరిమానాలు విధించడం కూడా తగదని స్థానిక నాయకులు పేర్కొన్నారు.
పాఠశాలకు షోకాజ్ నోటీసులు
వివాదం తీవ్రం కావడంతో మీరా భాయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (MBMC) విద్యాశాఖ అధికారులు స్పందించారు. సదరు పాఠశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.
