D Educt: Sept 23: తెలంగాణలో 10,500 ఎంబీబీఎస్‌ సీట్లు.. ఎన్‌ఎంసీ సీట్‌ మ్యాట్రిక్స్‌ విడుదల

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఈ ఏడాది అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్‌ సీట్ల వివరాలతో కూడిన సీట్‌ మ్యాట్రిక్స్‌ను జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సెప్టెంబరు 22న విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 10,500 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడైంది.

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 4,400 సీట్లు

తెలంగాణలో ప్రస్తుతం 36 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఈ ఏడాది అదనంగా 110 ఎంబీబీఎస్‌ సీట్లు పెరిగాయి. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం 4,400 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఎన్‌ఎంసీ సీట్‌ మ్యాట్రిక్స్‌ స్పష్టం చేసింది.

ప్రైవేటు కళాశాలల్లో 6,100 సీట్లు

రాష్ట్రంలో మొత్తం 30 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉండగా, ఈ ఏడాది కొత్తగా 950 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రైవేటు వైద్య కళాశాలల్లో మొత్తం 6,100 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నట్లు ఎన్‌ఎంసీ వెల్లడించింది.

ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలను కలిపి తెలంగాణలో ఈ ఏడాది మొత్తం 10,500 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. పెరిగిన సీట్లతో వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అదనపు అవకాశాలు అందుబాటులోకి వచ్చినట్లు చెప్పవచ్చు.

దేశవ్యాప్తంగా 1,40,664 ఎంబీబీఎస్‌ సీట్లు

ఇక దేశవ్యాప్తంగా ఈ ఏడాది కొత్తగా 13,638 ఎంబీబీఎస్‌ సీట్లు పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలను కలిపి మొత్తం 839 వైద్య కళాశాలల్లో 1,40,664 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నట్లు జాతీయ వైద్య కమిషన్‌ వెల్లడించింది.