D Educt: Sept 23: డిగ్రీ స్పాట్ ప్రవేశాలు.. సెప్టెంబరు 24 నుంచి ప్రారంభం

దోస్త్‌ (DOST) ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు సెప్టెంబరు 24 నుంచి స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌, దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య వి. బాలకిష్టారెడ్డి తెలిపారు. స్పాట్‌ ప్రవేశాలను రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తొలి విడతలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల్లోని ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నారు.

ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కూడా అవకాశం

స్పాట్‌ ప్రవేశాల్లో తెలంగాణ విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా సీట్లు పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఒక సీటుకు ఎక్కువ మంది పోటీ పడిన సందర్భంలో స్థానిక విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇస్తామని దోస్త్‌ కన్వీనర్‌ స్పష్టం చేశారు. స్పాట్‌ ప్రవేశాల ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అనర్హులని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా స్పాట్‌ ప్రవేశాల కోసం దాదాపు 2.50 లక్షల డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను పరిశీలించి, నిర్ణీత గడువులోగా ప్రవేశాలు పొందాలని సూచించారు.

స్పాట్‌ ప్రవేశాల షెడ్యూల్‌ ఇదే

సెప్టెంబరు 23న దోస్త్‌ వెబ్‌సైట్‌లో కళాశాలల వారీగా అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల వివరాలను పొందుపరచనున్నారు. విద్యార్థులు ఈ వివరాలను పరిశీలించి తమకు అనుకూలమైన కళాశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

సెప్టెంబరు 24, 25 తేదీల్లో తొలి విడత స్పాట్‌ ప్రవేశాలు నిర్వహించనున్నారు. ఈ విడతలో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లోని రెగ్యులర్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది.

అదేవిధంగా సెప్టెంబరు 28, 29 తేదీల్లో రెండో విడత స్పాట్‌ ప్రవేశాలు జరగనున్నాయి. ఈ విడతలో అన్ని రకాల కళాశాలల్లో రెగ్యులర్‌, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పించనున్నారు.