
D News : నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది పారడైజ్’ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా ప్రీమియర్ షో చూడాలని నాని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ పోలీసు అధికారులను ట్యాగ్ చేస్తూ నాని సోషల్ మీడియా వేదికగా తన విజ్ఞప్తిని తెలిపారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని పేర్కొన్నారు. ప్రేక్షకుల మధ్య కూర్చొని వారి స్పందనను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు.
అదే సమయంలో తన థియేటర్ సందర్శన సమయంలో అన్ని నిబంధనలు, భద్రతా మార్గదర్శకాలను పాటిస్తామని నాని స్పష్టం చేశారు. ప్రేక్షకుల భద్రతకు కూడా పూర్తి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి సూచన ఇదే..
నాని విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణకు చెందిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సినిమాపై నాని చూపిస్తున్న నిబద్ధతను అభినందించారు.
అయితే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రీమియర్ షోకు హాజరయ్యేందుకు ముందుగా అధికారిక ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం సూచించారు. రద్దీని నియంత్రించడం, ప్రజల భద్రతను నిర్ధారించడం కోసం సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
నాని సమర్పించే దరఖాస్తును సంబంధిత పోలీసు బృందం పరిశీలించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై తెలంగాణ డీజీపీని కూడా ట్యాగ్ చేశారు.
