
D Educt: Sept 22: కూటమి ప్రభుత్వం మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించింది. వివిధ యాజమాన్యాల పరిధిలో ఎన్ని పోస్టులు అవసరమవుతాయన్నదానిపై వివరాలను సేకరించి, ప్రాథమికంగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. డీఎస్సీతో పాటు డైట్, రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ), గ్రంథాలయాల్లో సిబ్బంది నియామకానికి కూడా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 15న ఈ నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని ఇప్పటికే విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2026 సంవత్సరానికి సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, పురపాలక, జువనైల్ సంక్షేమం, గిరిజన గురుకులాలు, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, దివ్యాంగ, బీసీ సంక్షేమ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అన్ని విభాగాల్లోని ఉపాధ్యాయ పోస్టులను కలిపి 2,500కు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పోస్టుల సంఖ్యపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
పాఠశాల విద్యలో 2 వేలకు పైగా పోస్టులు
పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా రూపొందించిన జాబితా ప్రకారం ప్రభుత్వ, పురపాలక, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో కలిపి సుమారు 2,250 ఉపాధ్యాయ పోస్టులు ఉండనున్నాయి. అయితే ఈ సంఖ్యలో మార్పులు ఉండే అవకాశం ఉంది. పోస్టుల సంఖ్యపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న తర్వాత స్పష్టత రానుంది. మిగతా అన్ని విభాగాల విద్యా సంస్థల్లోని ఖాళీలను కలుపుకుంటే సుమారు 300 వరకు పోస్టులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
డీఎస్సీ పోస్టులతో పాటు డైట్, ఎస్సీఈఆర్టీ లెక్చరర్ పోస్టులు 160, జూనియర్ లెక్చరర్ పోస్టులు 209, లైబ్రేరియన్ పోస్టులు సుమారు 100 వరకు ఉండనున్నట్లు సమాచారం. ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్నారు.
2029 వరకు ముందుగానే ప్రణాళిక
ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ముందుగానే ఉద్యోగాల భర్తీపై ప్రణాళిక సిద్ధం చేసింది. 2029 వరకు ప్రతి ఏడాది భర్తీ చేయాల్సిన ఉద్యోగాల జాబితాను ప్రాథమికంగా రూపొందించింది. మొత్తం ఖాళీల్లో 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా, మిగతా 30 శాతం పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.
2026 సంవత్సరంతో పాటు 2027, 2028, 2029 సంవత్సరాల్లో ఏర్పడే ఖాళీలను కూడా పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా గుర్తించింది. దీంతో ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహణకు ముందుగానే ఖాళీలను గుర్తించి, నియామక ప్రక్రియను చేపట్టేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.
