
D NEWS: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ చర్చ సందర్భంగా పాఠశాలల మూసివేత, ఉపాధ్యాయుల నియామకాలను ఆమె ప్రస్తావించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,913 పాఠశాలలు మూతపడ్డాయని సబిత ఆరోపించారు. మరో 400 పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జరిగిందని పేర్కొన్నారు. ఎన్ని పాఠశాలలను తిరిగి ప్రారంభించారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే, 257 గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ పాఠశాలలు లేవని సబిత తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 23 లక్షల నుంచి 19 లక్షలకు తగ్గిందని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని ఆమె తెలిపారు.
ఉపాధ్యాయుల నియామకాలపైనా సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నలు సంధించారు. గతంలో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. అయితే 11 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ఉపాధ్యాయుల సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు.
మరోవైపు, బీఆర్‌ఎస్ హయాంలో మూసివేసిన 79 పాఠశాలలను తిరిగి ప్రారంభించామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 26 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని హరీశ్‌రావు పేర్కొన్నారు. దీంతో పాఠశాలల మూసివేత, విద్యార్థుల సంఖ్య, టీచర్ నియామకాలపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి.
