వందేమాతరం గేయం విషయంలో కర్ణాటక అసెంబ్లీ విధాన మండలిలో సోమవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు పశ్చిమ కనుమలకు సంబంధించి కస్తూరిరంగన్ నివేదికపై చర్చించేందుకు కర్ణాటక ప్రభుత్వం మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు సభ్యులు వందేమాతరం గేయాన్ని ఆలపించారు. అయితే కాంగ్రెస్ సభ్యులు తొలి రెండు చరణాల తర్వాత గేయాన్ని నిలిపివేయగా బీజేపీ సభ్యులు మాత్రం పూర్తి గేయాన్ని ఆలపించారు. కాంగ్రెస్ సభ్యులు రెండు చరణాలకే పరిమితం కావడంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును విమర్శిస్తూ నినాదాలు చేశారు.
అనంతరం స్పీకర్ జీఎస్ పాటిల్ ఇటీవల మృతి చెందిన పలువురు ప్రముఖులకు సంతాపం తెలిపారు. గత నెల 27న కన్నుమూసిన ఎమ్మెల్యే ఆర్బీ శిరియణ్ణవర్కు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాళులర్పించారు. విధాన మండలిలోనూ ఇదే అంశంపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.
ఇక్కడ కూడా అధికార పార్టీ సభ్యులు వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించగా బీజేపీ సభ్యులు పూర్తి గేయాన్ని ఆలపించారు. దీనిపై బీజేపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మండలి చైర్మన్ సలీం అహ్మద్ రాజ్యాంగ పీఠికను చదువుతున్న సమయంలోనూ బీజేపీ సభ్యులు వందేమాతరంలోని మిగిలిన చరణాలను ఆలపించారు.
పూర్తి గేయాన్ని ప్లే చేయకపోవడంపై ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. కాగా అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.