
తెలంగాణ రాజకీయాల్లో భూములు ఫామ్‌హౌస్‌ల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావుకు సంబంధించినవిగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న అజీజ్ నగర్ భూములను కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం ఆదివారం పరిశీలించింది. ప్రజా భవన్ నుంచి బయలుదేరిన బృందం తొలుత అజీజ్ నగర్‌లోని ఫామ్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించింది. అనంతరం మొయినాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినదిగా పేర్కొంటున్న ఫామ్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించనుంది.
ఈ ఫీల్డ్ విజిట్‌లో ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ యాదవ్, మల్లు రవి, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్‌ఎస్ నేతలపై పలు ఆరోపణలు చేశారు. సిద్దిపేటలోని రంగనాయక్ సాగర్ వద్ద హరీశ్ రావు ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారని లావోని పట్టా భూముల బదిలీకి సంబంధించి ప్రశ్నలు ఉన్నాయని ఆయన అన్నారు.
అజీజ్ నగర్, జన్వాడ, ఎర్రవల్లి ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లపై కూడా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ ఆస్తులు పూర్వీకుల నుంచి వచ్చాయని కేటీఆర్ చెబుతున్నారని ప్రస్తావించిన చామల ఆ ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా పొందే ఆదాయంతో కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సమకూరాయో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జీవో 111 నిబంధనలను ఉల్లంఘించి జన్వాడ అజీజ్ నగర్ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
అలాగే కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లో అసైన్డ్ భూములకు సంబంధించి కూడా ప్రభుత్వం గతంలో అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాలపై సమాధానం చెప్పాలని చామల కోరారు. తాము ప్రైవేట్ ఆస్తుల్లోకి వెళ్లడం లేదని ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై మాత్రమే ప్రశ్నలు లేవనెత్తుతున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు బీఆర్‌ఎస్ నేతలు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
