
D News: విలక్షణ నటనతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి తన హాలీవుడ్ కల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమా హాలీవుడ్‌కు వెళ్లడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆయన.. అక్కడ నటించే అవకాశం వస్తే తప్పకుండా చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఇటీవల ‘మహారాజా 2’ కథను దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తనకు వినిపించారని విజయ్ సేతుపతి వెల్లడించారు. కథ తనకు బాగా నచ్చిందని, నిథిలన్ అద్భుతమైన దర్శకుడని ప్రశంసించారు. ‘మహారాజా’ విడుదలకు ముందు సినిమాపై కొందరికి సందేహాలు ఉన్నప్పటికీ.. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు అప్పుడే ఉందని గుర్తుచేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. ‘మహారాజా’ను హాలీవుడ్‌కు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిర్మాత తనకు చెప్పారని విజయ్ సేతుపతి తెలిపారు. ఈ రీమేక్‌లో హాలీవుడ్ నటుడు మాథ్యూ మెక్కానగీ నటించబోతున్నట్లు తెలిసి తాను ఎంతో థ్రిల్ అయ్యానన్నారు.
అంతేకాదు, నిర్మాతతో సరదాగా మాట్లాడుతూ.. “ఒక సినిమాలో నేను ఉచితంగా నటిస్తాను.. కానీ హాలీవుడ్ రీమేక్‌లో నాకు కూడా ఓ చిన్న పాత్ర ఇవ్వండి. నేను అక్కడికి వచ్చి నటిస్తాను” అని చెప్పినట్లు విజయ్ సేతుపతి వెల్లడించారు. మొదటి నుంచీ హాలీవుడ్లో నటించాలనే కోరిక తనకు ఉందని, తన సినిమా అక్కడికి చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
