
D News: థియేటర్లలో సక్సెస్ అందుకున్న తర్వాత ఓటీటీలోనూ తన సత్తా చాటుతోంది సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య, మమితా బైజు జంటగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోంది.
స్ట్రీమింగ్‌లోకి వచ్చిన కొద్దికాలంలోనే ఈ సినిమా ఇండియా ట్రెండింగ్ చార్ట్స్‌లో నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు.. గ్లోబల్ ట్రెండింగ్‌లో టాప్-3లో నిలిచినట్లు చిత్రబృందం వెల్లడించింది. దీంతో థియేటర్ల తర్వాత డిజిటల్ వేదికపైనా సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది.
‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య తన నటనతో ఆకట్టుకోగా.. మమితా బైజు కీలక పాత్రలో కనిపించారు. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
ఇదీ కథ..
సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఓ బిజినెస్‌మ్యాన్. తన తల్లి కోరిక మేరకు ఒలింపిక్స్‌లో మెడల్ సాధించినా.. పెళ్లి విషయంలో మాత్రం ఆమె మాట వినడు. చిన్ననాటి కొన్ని కారణాలతో వివాహానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సంజయ్.. తన తల్లి తమ వంశం కొనసాగదనే బాధను చూసి సరోగసీ ద్వారా ఓ బిడ్డను కంటాడు.
అయితే ఆ బిడ్డకు అరుదైన బోన్ మ్యారో వ్యాధి ఉన్నట్లు తెలుస్తుంది. చికిత్స కోసం తల్లి బోన్ మ్యారో డోనర్‌గా ఉండాల్సి రావడంతో సంజయ్ ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ ప్రయాణంలో అతనికి మ్యాడీ (మమితా బైజు) పరిచయం అవుతుంది. ఆ తర్వాత సంజయ్ జీవితంలో చోటుచేసుకునే మార్పులే సినిమా కథ.
