D Educt: Sept 18: దేశవ్యాప్తంగా బీఈడీ విద్యార్హతతో ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (SGT)గా పనిచేస్తున్న వారు బ్రిడ్జి కోర్సును పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ ఆరు నెలల సర్టిఫికెట్‌ కోర్సును ప్రారంభించింది.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (NIOS) ద్వారా ఈ కోర్సును నిర్వహించనున్నారు. ఇందులో ఆన్‌లైన్‌ కాంటాక్ట్‌ తరగతులతో పాటు పాఠశాల ఆధారిత అనుభవం, ప్రాక్టికల్స్‌ తదితర అంశాలు ఉంటాయి. కోర్సులో భాగంగా ఆంగ్లం, హిందీ భాషల్లో తరగతులు నిర్వహించనున్నారు.

అయితే పరీక్షలను తెలుగు సహా దేశంలోని 22 అధికారిక భాషల్లో రాసుకునే అవకాశం కల్పించారు. దీంతో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులు తమకు అనుకూలమైన భాషలో పరీక్షలు రాయవచ్చు.

దేశవ్యాప్తంగా ఈ బ్రిడ్జి కోర్సులో మొత్తం 76,731 మంది ప్రవేశాలు పొందారు. ఇందులో తెలంగాణ నుంచి 283 మంది, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 242 మంది ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌ నుంచి అత్యధికంగా 35,440 మంది ప్రవేశాలు పొందడం గమనార్హం.