ఆసియా కప్ ట్రోఫీల వ్యవహారంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక సమాచారం వెల్లడించారు. 2025 పురుషుల ఆసియా కప్, 2026 మహిళల ఆసియా కప్‌లో ఛాంపియన్లుగా నిలిచిన భారత జట్లకు సంబంధించిన రెండు ట్రోఫీలు త్వరలోనే భారత్‌కు చేరనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ట్రోఫీలు దుబాయ్‌లోని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) కార్యాలయంలో ఉన్నట్లు వెల్లడించారు.

రెండు సార్లూ ఒకే పరిస్థితి

2026 మహిళల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను భారత్ 72 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది. అయితే బహుమతి ప్రదాన కార్యక్రమంలో ACC అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు ముందుకు రాలేదు. 2025 పురుషుల ఆసియా కప్‌లోనూ ఇదే తరహా పరిస్థితి ఎదురైంది.

బీసీసీఐ తీసుకున్నది ఆటగాళ్లకు లేదా క్రికెట్‌కు వ్యతిరేకమైన నిర్ణయం కాదని, సంస్థాగతంగా తీసుకున్న నిర్ణయమని సైకియా స్పష్టం చేశారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

త్వరలో ముంబైకి ట్రోఫీలు

తాజాగా ట్రోఫీలపై స్పందించిన సైకియా.. రెండు ఆసియా కప్ ట్రోఫీలు త్వరలోనే బీసీసీఐ చేతికి వస్తాయని స్పష్టం చేశారు. అయితే వాటిని భారత్‌కు తీసుకురానున్న కచ్చితమైన తేదీని మాత్రం వెల్లడించలేదు.

2026 మహిళల ఆసియా కప్ ట్రోఫీతో పాటు గతేడాది నుంచి భారత్‌కు చేరని 2025 పురుషుల ఆసియా కప్ ట్రోఫీ కూడా త్వరలో ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి చేరుతుందని ఆయన తెలిపారు.

రెండు టోర్నీల్లోనూ భారత జట్లు ఛాంపియన్లుగా నిలిచిన నేపథ్యంలో.. ట్రోఫీలు ఆలస్యంగా వచ్చినా, తుది విజేతలు మాత్రం భారత్‌దేనని సైకియా పేర్కొన్నారు.