
D Spiritual: Sept 11: మట్టి గణపతిని పూజిస్తే విశిష్ట ఫలితాలు
వినాయక చవితి సందర్భంగా మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాన్ని పూజించడం అత్యంత శ్రేష్ఠమని ప్రముఖ ప్రవచనకర్త సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. మానవులంతా పృథ్వీ తత్వానికి సంబంధించిన వారని, అందుకే మాతృస్వరూపమైన మట్టిని ఆరాధించడం ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
గణేశుడి తండ్రి పరమశివుడికి కూడా పార్థివ లింగార్చన ప్రత్యేకమైన శాస్త్ర విధానమని ఆయన గుర్తుచేశారు. ఈ కారణంగా వినాయక చవితి రోజున రసాయన రంగులు లేని స్వచ్ఛమైన మట్టి విగ్రహాన్ని పూజించడం ఆధ్యాత్మికంగా విశిష్టమైనదని తెలిపారు.
గణేశుడి ఆవిర్భావంలోనూ మట్టి ప్రాధాన్యత
గణేశుడి ఆవిర్భావానికి సంబంధించిన పౌరాణిక కథలోనూ మట్టికి ప్రాధాన్యత కనిపిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. పార్వతీదేవి తన శరీరానికి రాసుకున్న నలుగు పిండితో గణేశుడి రూపాన్ని తయారు చేసి, అనంతరం ప్రాణప్రతిష్ఠ చేసినట్లు పురాణ కథనం.
ప్రకృతి సిద్ధమైన పదార్థంతో గణేశుడు ఆవిర్భవించినందున.. మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించి, అనంతరం నిమజ్జనం చేయడం ప్రకృతికి అనుకూలమైన సంప్రదాయంగా భావిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రంగులతో తయారు చేసిన విగ్రహాలతో పోలిస్తే సహజ మట్టి గణపతులను పూజించడం పర్యావరణ పరిరక్షణకు కూడా మేలు చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు పేర్కొంటున్నారు.
