
D News: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇరుముడి’ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘జనరేషనల్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్’లో చిత్రబృందం పాల్గొంది. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ సినిమాతో తనకు లభించిన గౌరవాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
తన సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు, పరాజయాలు చూశానని చెప్పిన రవితేజ.. బాక్సాఫీస్ హిట్స్ కంటే ‘ఇరుముడి’ తనకు నటుడిగా మరింత గౌరవాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్ల ముఖాల్లో కనిపించిన ఆనందం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు.
ఈ విజయానికి పూర్తి క్రెడిట్ దర్శకుడు శివ నిర్వాణకే దక్కుతుందని రవితేజ ప్రశంసించారు. సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని, రాత్రింబవళ్లు తేడా లేకుండా టీమ్‌ను నడిపించారని తెలిపారు. తన కెరీర్లో ఇంతగా నైట్ షూటింగ్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి అని చెప్పారు.
అలాగే జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు ఆత్మలా నిలిచిందని రవితేజ కొనియాడారు. ప్రేక్షకులు సినిమాను తమ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఈ వేడుకకు దర్శకులు అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు సానా తదితరులు హాజరై చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
