
D News: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. షో ప్రారంభమైన నాలుగో రోజే తొలి ఎలిమినేషన్ ప్రక్రియను నిర్వహించిన బిగ్‌బాస్.. చరణ్‌ను ఇంటి నుంచి బయటకు పంపించారు. దీంతో హౌస్‌మేట్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
తొలి దశలో భాగంగా హై రిస్క్ టాస్క్ నిర్వహించిన బిగ్‌బాస్.. దేబ్జానీ టీమ్ నుంచి ముకేశ్, త్రిగుణ్, రోహిత్ టీమ్ నుంచి రోహిత్, వంశీలను పిలిచారు. తమ టీమ్‌లోని ఒకరిని హై రిస్క్‌లో పెట్టాలని ఆదేశించారు. దీంతో ముకేశ్, త్రిగుణ్ కలిసి కృష్ణుడిని, రోహిత్, వంశీ కలిసి చైత్ర రాయ్‌ను హై రిస్క్‌లోకి పంపించారు.
చైత్రను హై రిస్క్‌లో పెట్టడంపై ఆమె తీవ్రంగా బాధపడింది. సొంత టీమ్ తనకు అండగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో షాలినితో ఆమెకు వాగ్వాదం కూడా జరిగింది. అనంతరం రోహిత్ చైత్రను ఓదార్చే ప్రయత్నం చేశాడు.
ఆ తర్వాత హై రిస్క్‌లో ఉన్న చైత్ర, చరణ్, రామ్ ప్రసాద్‌లను బిగ్‌బాస్ పిలిచి.. వీరిలో ఒకరిని ఎలిమినేషన్ నుంచి కాపాడే అవకాశం ఇచ్చారు. చరణ్, రామ్ ప్రసాద్ కలిసి చైత్రను సేవ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే చరణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కనిపించింది.
అనంతరం చరణ్, రామ్ ప్రసాద్‌లలో ఎవరు ఇంట్లో కొనసాగకూడదో నిర్ణయించే ప్రక్రియ చేపట్టారు. ఇంటి సభ్యులు తమకు నచ్చని కంటెస్టెంట్‌కు ముఖానికి రంగు పూసి కారణం చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించారు.
ఈ ప్రక్రియలో చరణ్‌కు ఎక్కువ మంది సభ్యులు వ్యతిరేకంగా నిలిచారు. త్రిగుణ్, కృష్ణుడు, సుధీర్, వర్షిణి, వంశీ, ముకేశ్, దేబ్జానీ, నరేష్, ఝాన్సీ తదితరులు చరణ్‌కు రంగు పూశారు. రామ్ ప్రసాద్‌కు సృష్టి, షాలిని, అమన్, రోహిత్ రంగు పూశారు.
ఎక్కువ ఓట్లు చరణ్‌కు రావడంతో అతడే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో తొలి ఎలిమినేషన్‌గా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. నాలుగో రోజే ఎలిమినేట్ కావడంతో చరణ్ భావోద్వేగానికి గురయ్యాడు.
చరణ్ ఎలిమినేషన్‌కు ప్రధానంగా అతడు సొంతంగా ఆట ఆడటం లేదని, రోహిత్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నాడని పలువురు సభ్యులు కారణంగా చెప్పారు. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన సభ్యులంతా ఒక గ్రూప్‌గా ఉండటం వల్ల చరణ్ వ్యక్తిగత ఆటను చూపించలేకపోయాడనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే మరికొంత సమయం దొరికితే తన ఆటను నిరూపించుకునే అవకాశం ఉండేదని కొందరు భావించినా.. ఎలిమినేషన్ ప్రక్రియలో మాత్రం చరణ్‌కు అనుకూలంగా ఫలితం రాలేదు.
