
D Educt: Sept 9: ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పులు
ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో బట్టీ చదివే విధానానికి స్వస్తి పలికి, వారిలో విశ్లేషణాత్మక ఆలోచనా శక్తిని పెంపొందించేలా ప్రశ్నపత్రాల్లో కీలక మార్పులు తీసుకురానున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పరాఖ్ మార్గదర్శకాలకు అనుగుణంగా 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులను అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా శక్తిని పరీక్షించేలా ప్రశ్నపత్రాల్లో 10 శాతం ప్రశ్నలను రూపొందించనున్నారు. జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం దేశవ్యాప్తంగా పరీక్షా విధానంలో ఒకే రకమైన ప్రమాణాలను తీసుకురావాల్సిన అవసరం ఉండటంతో ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు.
ఇందుకు అనుగుణంగా జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల్లో ప్రతి పాఠం ముగిసిన తర్వాత కొన్ని ప్రశ్నలను అందిస్తున్నారు. పబ్లిక్ పరీక్షల్లోనూ ప్రధానంగా ఈ ప్రశ్నల నుంచే ప్రశ్నలను రూపొందిస్తున్నారు.
అయితే ప్రస్తుత విధానంలో విద్యార్థుల సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచనా సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలు తక్కువగా ఉంటున్నాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రశ్నపత్రాల్లో 10 శాతం ప్రశ్నలను విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా శక్తిని పరీక్షించే విధంగా రూపొందించనున్నారు.
క్వశ్చన్ బ్యాంక్ ఏర్పాటు
కొత్త విధానంలో భాగంగా ప్రత్యేక క్వశ్చన్ బ్యాంక్‌ను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్మీడియట్ విద్యా మండలి అధ్యాపకులకు కార్యశాలలు నిర్వహిస్తోంది. అధ్యాపకుల నుంచి కొత్త తరహా ప్రశ్నలను ఆహ్వానించి, వాటిని పరిశీలించిన అనంతరం ప్రశ్నల బ్యాంకును రూపొందించనున్నారు.
సిద్ధం చేసిన క్వశ్చన్ బ్యాంక్‌లోని ప్రశ్నలను వచ్చే విద్యా సంవత్సరం ముద్రించనున్న ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల్లో ప్రతి పాఠం ముగిసిన తర్వాత ఇచ్చే ప్రశ్నల్లో చేర్చనున్నారు. తద్వారా విద్యార్థులు కేవలం బట్టీ పట్టకుండా విషయాన్ని అర్థం చేసుకుని, విశ్లేషించి సమాధానం ఇచ్చే విధంగా వారిని ప్రోత్సహించనున్నారు.
