
D News: మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. దీంతో మార్కుక్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఫామ్‌హౌస్ చుట్టూ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎర్రవల్లిలో భారీ పోలీసు బందోబస్తు
ఫామ్‌హౌస్ పరిసరాల్లో వెయ్యి మందికి పైగా పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఫామ్‌హౌస్ చుట్టూ కంచె ఏర్పాటు చేసి, అన్ని మార్గాల్లో పోలీసులను మోహరించారు.
మూడు కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిపివేత
ఫామ్‌హౌస్‌కు సమీపంలోని ప్రాంతాల్లో సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. డీఐజీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.
ఎర్రవల్లికి చేరుకున్న BRS విద్యార్థి నేతలు
మరోవైపు సుమారు 150 మంది BRSకు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఎర్రవల్లికి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకుల ముట్టడి ప్రయత్నాలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.
పలువురు BRS నేతలు అదుపులోకి
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ BRS విద్యార్థి నాయకులు ఆందోళనకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి అదుపు తప్పకుండా పలువురు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని ఇతర ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.
