
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమైన వెంటనే సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాసనసభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు తీరుపై మండిపడిన స్పీకర్ ‘‘మీరు లొల్లిపెడితే నేను భయపడను. మీరు చేసేది తప్పు’’ అంటూ హెచ్చరించారు.
అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై తనకు గౌరవం ఉందన్నారు. వారిపై జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను తెప్పించుకుంటున్నామని, ఈ ఘటనపై సీఎం నివేదిక కోరారని తెలిపారు. నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇష్టానుసారంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం సరికాదన్నారు. స్పీకర్‌ను సభ్యులు అగౌరవపరిస్తే కనీసం స్పందించరా అని ప్రశ్నించిన శ్రీధర్ బాబు సభాపతిని బెదిరించడం సరైన పద్ధతి కాదని అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా బీఆర్ఎస్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఒక దళిత స్పీకర్‌ను అవమానించారని ఆరోపించారు. వారి తల్లిని కూడా అవమానించారని పేర్కొంటూ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఓ పోలీసు అధికారి గల్లా పట్టుకుని కొట్టారని, హరీశ్ రావు మహిళా అధికారుల ఎదుట షర్ట్ విప్పారని ఆరోపించారు. ముందుగా స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
