
D News: సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మండాడి’ చిత్రంపై దర్శకుడు శివ నిర్వాణ ప్రశంసలు కురిపించారు. సముద్రం నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో ప్రేక్షకులు ఇంతవరకు చూడని విజువల్స్‌ను చూస్తారని చిత్ర బృందం చెబుతోంది. మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. మహిమా నంబియార్ కథానాయికగా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది.విడుదలకు ముందు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకకు శివ నిర్వాణ, శైలేష్ కొలను, సందీప్ రాజ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివ నిర్వాణ మాట్లాడుతూ.. సినిమా టీజర్, ట్రైలర్‌లోని సముద్రంపై చిత్రీకరించిన బోట్ యాక్షన్ సన్నివేశాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.సముద్రంలో ఇలాంటి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడం అంత సులభం కాదని, అందుకోసం చిత్ర బృందం ఎంతో కష్టపడిందని ప్రశంసించారు. ‘మండాడి’కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రావాలని కోరుకున్న ఆయన.. ఈ సినిమాకు చాలా అవార్డులు వచ్చే అవకాశం ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ.. సినిమా టైటిల్ వినగానే చూడాలనిపించేలా ఉందని అన్నారు. హీరో సూరి మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవన విధానం, బోట్ రేసింగ్ నేపథ్యంలో సాగే విభిన్నమైన యాక్షన్ డ్రామాగా ‘మండాడి’ రూపొందిందని చెప్పారు. దర్శకుడు మతిమారన్ ఈ కథను ఎంతో నిజాయతీగా తెరకెక్కించారని పేర్కొన్నారు. సుహాస్‌తో తనకు వచ్చే సన్నివేశాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు.
సుహాస్ మాట్లాడుతూ.. ‘మండాడి’ తమ అందరికీ మంచి ఫలితాన్ని అందిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. సూరితో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఆయన తనను సొంత తమ్ముడిలా చూసుకున్నారని తెలిపారు. సూరి, మహిమా నంబియార్, రవీంద్ర విజయ్ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నవీన్ ఎర్నేని, ఎల్రెడ్ కుమార్, మతిమారన్ పుగళేంది, మహిమా నంబియార్, రవీంద్ర విజయ్, భాస్కర్ భట్ల తదితరులు పాల్గొన్నారు.
