
మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన తర్వాత కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. ఓ మీడియా చానెల్‌తో మాట్లాడిన సురేఖ మాజీ సీఎం కేసీఆర్ చాలా మంచివారని, హుందాగా వ్యవహరిస్తారని తమను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదని పేర్కొన్నారు. అంతేకాదు, తాము అడిగిన వెంటనే కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తుచేశారు. గతంలో బీఆర్‌ఎస్‌పై కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన సురేఖ ఇప్పుడు కేసీఆర్‌ను ప్రశంసించడం వెనుక రాజకీయ కారణాలున్నాయా? అనే చర్చ మొదలైంది.
2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ రెండో జాబితాలోనూ తనకు చోటు లేకపోవడంతో ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కొండా దంపతులు తిరిగి గులాబీ గూటికి చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. బీఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్‌గా పేరున్న మాజీ మంత్రి హరీశ్‌రావు వారితో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
అయితే గతంలో మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్‌పై సురేఖ చేసిన తీవ్ర ఆరోపణలు, వాటికి సంబంధించిన కోర్టు కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సురేఖ తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వస్తే కేటీఆర్ వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీజేపీ కూడా కొండా దంపతులకు ఆహ్వానం పలుకుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఎన్నికలపై కొండా ప్రభావం ఎంత?
త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొండా దంపతుల రాజకీయ నిర్ణయంపై అన్ని పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా అందులో 25 డివిజన్లు వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో కొండా దంపతుల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న దానిపై ప్రధాన పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి.
గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో పోటీకి అనుగుణంగా కాంగ్రెస్ బీఫామ్‌లతో సంబంధం లేకుండా కొండా దంపతులు ప్రత్యేకంగా ఓ టీమ్‌ను సిద్ధం చేసుకున్నారనే ప్రచారం కూడా ఉంది. తమ కుమార్తె కొండా సుస్మితను రాజకీయంగా క్రియాశీలకం చేసేందుకు ఈ ఎన్నికలను వేదికగా ఉపయోగించుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొందరు కీలక నేతలతో కొండా దంపతులు చర్చలు జరిపినట్టు సమాచారం.
మంత్రి హోదా సౌకర్యాల ఉపసంహరణ
మరోవైపు సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడంతో ఇప్పటివరకు మంత్రి హోదాలో ఆమెకు కల్పించిన సౌకర్యాలను ప్రభుత్వం ఉపసంహరిస్తోంది. మంత్రి హోదాలో కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని అధికారులు శుక్రవారం వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది. హైదరాబాద్, హన్మకొండలోని ఆమె నివాసాల వద్ద ఉన్న పోలీసు భద్రతను కూడా తొలగించినట్టు సమాచారం. మంత్రి హోదాలో ఉన్న గన్‌మన్ల సంఖ్యను తగ్గించి, ఎమ్మెల్యే హోదాకు అనుగుణంగా భద్రతను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ మరికొందరిపై నమోదైన హత్యాయత్నం కేసులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు శుక్రవారం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. సుమంత్ ఆచూకీ కేసుకు సంబంధించిన ఇతర వివరాలపై వారిని ప్రశ్నించినట్టు సమాచారం. మొత్తంగా కొండా దంపతులు కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? బీఆర్‌ఎస్ వైపు అడుగులు వేస్తారా? లేక బీజేపీని ఎంచుకుంటారా? అన్నది ఇప్పుడు ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
