
D News: ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టాటా మధుసూదన్ ఆరోపించారు. రైతులు, మహిళలు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. మరోవైపు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్నికల హామీలను విస్మరించారు
ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వాటిని అమలు చేయడం లేదని టాటా మధుసూదన్ ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.
రైతులు, మహిళలు, పేదలపై ప్రభావం
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ రైతులు, పేదలు, మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని మధుసూదన్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు.
హామీల అమలుపై ప్రశ్నలు
రైతు భరోసా కింద రూ.15 వేలు, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500, విద్యార్థినులకు స్కూటర్లు, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని మధుసూదన్ విమర్శించారు.
గోదావరి జలాల అంశంపై ఫైర్
ఆంధ్రప్రదేశ్ పాలకులు గోదావరి జలాలను అక్రమంగా మళ్లిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టాటా మధుసూదన్ ఆరోపించారు. స్థానిక చెరువులను నింపేందుకు నీటిని ఎత్తిపోసే మోటార్లు కూడా ఆన్ చేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ఢిల్లీ పర్యటనలపై వద్దిరాజు విమర్శలు
ఇల్లెందులో జరిగిన కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని ఆరోపించారు. చిన్నచిన్న సమస్యలకే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీకి పరుగులు తీస్తున్నారని విమర్శించారు. ఢిల్లీపై ఆధారపడే పార్టీలతో తెలంగాణకు ప్రయోజనం ఉండదని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి నిజమైన రక్షణ అని పేర్కొన్నారు.
