
D Spiritual: Sept 2: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ తన శాస్త్రవేత్తల బృందంతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన ఇస్రో బృందం, ఆనంద నిలయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది.
శ్రీవారి పాదాల చెంత రాకెట్ నమూనా
రాబోయే ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ GSLV-F17 (EOS-05) రాకెట్ నమూనాను ఇస్రో చైర్మన్ శ్రీవారి పాదాల చెంత ఉంచారు. అర్చకులు రాకెట్ నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఇస్రో బృందానికి ఆశీర్వచనాలు అందించారు.
సెప్టెంబర్ 4న GSLV-F17 ప్రయోగం
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC SHAR) నుంచి సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:55 గంటలకు GSLV-F17 రాకెట్‌ను ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. ఈ ప్రయోగం ద్వారా EOS-05 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
EOS-05 ఉపగ్రహంతో కీలక ప్రయోజనాలు
EOS-05 ఉపగ్రహం వాతావరణ పరిస్థితులు, భూగోళంలో చోటుచేసుకునే మార్పులు, ప్రకృతి విపత్తులను నిరంతరం పర్యవేక్షించడంలో కీలకంగా ఉపయోగపడనుంది. ఈ ఉపగ్రహం అందించే సమాచారంతో విపత్తుల నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ వంటి రంగాల్లో మరింత సమర్థవంతమైన సేవలు అందించే అవకాశం ఉంది.
ఇస్రో బృందానికి టీటీడీ అధికారులు స్వాగతం
తిరుమల ఆలయం వద్ద టీటీడీ అధికారులు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్‌తో పాటు శాస్త్రవేత్తల బృందానికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మంటపంలో వేద ఆశీర్వచనం నిర్వహించి, ఇస్రో బృందానికి తీర్థప్రసాదాలు అందజేశారు.
