
తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా వరుసగా ఢిల్లీ బాట పట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే హస్తినలో ఉండగా పలువురు మంత్రులు, కీలక నేతలు కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ వర్గాల్లో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలతోనూ సమావేశమయ్యే అవకాశముండటంతో ఆయన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే ఢిల్లీలోనే ఉన్నారు.
మరోవైపు మంత్రి కొండా సురేఖ కూడా హస్తిన చేరుకున్నారు. ఆమె ప్రయాణించిన విమానంలోనే మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఢిల్లీ వెళ్లడం ఆసక్తి రేపుతోంది. కొండా సురేఖ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్నారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క కూడా వరుసగా ఢిల్లీ చేరుకుంటున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం హస్తినకు వెళ్లనున్నారు. కొందరు మంత్రులు పాలనాపరమైన అంశాలపై కేంద్ర పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్తుండగా మరికొందరు పార్టీ వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీకి సిద్ధమవుతున్నారు.
ఇదే సమయంలో కీలక నేతల వరుస ఢిల్లీ పర్యటనలు కేబినెట్ విస్తరణ అంశంపై ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. మంత్రిపదవిపై ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆయన కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులపై ఖర్గేతో చర్చించినట్లు సమాచారం. కేబినెట్‌లో చోటు కల్పించాలని ఆయన కోరినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, స్పీకర్ వరకు కీలక నేతలంతా వరుసగా ఢిల్లీ బాట పట్టడంతో.. ఇది కేవలం పాలనాపరమైన పర్యటనలేనా? లేక తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నిర్ణయాలకు రంగం సిద్ధమవుతోందా? అన్న చర్చ జోరందుకుంది.
