
D Educt: Aug 31: GATE 2027 రిజిస్ట్రేషన్లకు బ్రేక్.. మరోసారి వాయిదా
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) 2027 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది పరీక్షను నిర్వహిస్తున్న ఐఐటీ మద్రాస్ (IIT Madras).. ఆగస్టు 27న ప్రారంభం కావాల్సిన దరఖాస్తుల స్వీకరణను తాత్కాలికంగా వాయిదా వేసింది. కొత్త రిజిస్ట్రేషన్ తేదీలను త్వరలో అధికారిక పోర్టల్లో ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
వాస్తవానికి GATE 2027 దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 14న ప్రారంభం కావాల్సి ఉంది. అనంతరం దాన్ని ఆగస్టు 27కు మార్చారు. అయితే తాజాగా ఆ తేదీన కూడా రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాలేదు. ప్రక్రియను ఎందుకు వాయిదా వేశారనే విషయంపై ఐఐటీ మద్రాస్ ఎలాంటి కారణాలను వెల్లడించలేదు.
DigiLocker ద్వారా రిజిస్ట్రేషన్ తప్పనిసరి
GATE 2027 దరఖాస్తు ప్రక్రియలో ఐఐటీ మద్రాస్ కీలక మార్పు చేసింది. భారతీయ అభ్యర్థులు తప్పనిసరిగా DigiLocker ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యేలోపు అభ్యర్థులు తమ DigiLocker ఖాతాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది.
ఇప్పటికే ఖాతా ఉన్నవారు తమ వివరాలను ఒకసారి పరిశీలించి అవసరమైన సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలని, ఖాతా లేని వారు ముందుగానే కొత్తగా క్రియేట్ చేసుకోవాలని తెలిపింది. రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన తర్వాత ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది.
