D-News: బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు తెలంగాణ ప్రజలకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే అనుబంధం ఎంతో విలువైనదని, తరతరాలుగా కొనసాగుతున్న పవిత్రమైన బంధమని ఆయన పేర్కొన్నారు.

రక్షాబంధన్‌ సందర్భంగా గురువారం విడుదల చేసిన ప్రకటనలో కేసీఆర్‌ ఈ పండుగకు భారతీయ కుటుంబ, సాంస్కృతిక, సంప్రదాయ జీవనంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర నమ్మకానికి రక్షాబంధన్‌ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

సమాజంలో ద్వేషం, స్వార్థ భావాలను పక్కన పెట్టి ప్రజలంతా పరస్పర సోదరభావంతో కలిసి జీవించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రజల మధ్య ఐక్యత, ప్రేమ, మానవత్వం పెంపొందినప్పుడే భారతీయ సంస్కృతిలోని ‘వసుధైవ కుటుంబకం’ భావన సాకారం అవుతుందని అన్నారు. ఈ రక్షాబంధన్‌ ప్రతి కుటుంబంలో సంతోషం, ఆప్యాయత, సోదరభావాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు.