
D Educt: Aug 25: ‘నీట్ యూజీ 2026’ ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర కన్వీనర్ కోటాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజినల్ మెరిట్ జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు 24న విడుదల చేసింది. అభ్యర్థులు తమకు సంబంధించిన వివరాలను పరిశీలించుకుని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే సమర్పించాలని అధికారులు సూచించారు.
అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఆగస్టు 26 మధ్యాహ్నం 12 గంటలలోపు అధికారులకు సమర్పించాలి. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు.
తుది మెరిట్ జాబితా విడుదలైన తర్వాత ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునేందుకు ప్రత్యేక నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేయనున్నారు.
దిల్లీ ఎయిమ్స్‌లో ఐదుగురు తెలంగాణ విద్యార్థులకు సీట్లు
నీట్ యూజీ 2026 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో టాప్ 100 ర్యాంకుల్లో నిలిచిన తెలంగాణకు చెందిన ఏడుగురు అభ్యర్థుల్లో ఐదుగురికి దిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ సీట్లు దక్కాయి. అఖిల భారత కోటా మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఫైనల్ మెరిట్ జాబితాను సోమవారం విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా మొదటి విడతలో అర్హత సాధించిన 29,946 మంది అభ్యర్థులతో కూడిన మెరిట్ జాబితాను ఎంసీసీ తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇందులో తెలంగాణకు చెందిన 13, 19, 21, 38, 42 ర్యాంకులు సాధించిన ఐదుగురు విద్యార్థులకు దిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ సీట్లు ఖరారయ్యాయి.
అదేవిధంగా 83, 91 ర్యాంకులు సాధించిన తెలంగాణ విద్యార్థులకు పుదుచ్చేరిలోని జిప్మర్లో ఎంబీబీఎస్ సీట్లు లభించాయి. దీంతో టాప్ 100లోపు ర్యాంకులు సాధించిన తెలంగాణ విద్యార్థుల్లో మొత్తం ఏడుగురికి ప్రముఖ వైద్య విద్యాసంస్థల్లో సీట్లు దక్కినట్లయింది.
