హైదరాబాద్లోని డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన అంశంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అభివృద్ధి, విద్య, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు, యువతకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడమే తన విదేశీ పర్యటన ప్రధాన ఉద్దేశమని రేవంత్రెడ్డి తెలిపారు. తెలంగాణను ప్రపంచ స్థాయి విద్యా, నైపుణ్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రముఖ అంతర్జాతీయ విద్యాసంస్థలతో భాగస్వామ్యాలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
అమెరికా పర్యటనకు కేంద్రం రాజకీయ అనుమతి ఇవ్వకపోవడంపై రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, తెలంగాణకు పెట్టుబడులు, విద్యా అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలను తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.
కేంద్రం అనుమతి నిరాకరించడంతో తన 10 రోజుల UK–US పర్యటనను కుదించుకుని హైదరాబాద్కు తిరిగి వచ్చినట్లు సీఎం తెలిపారు. లండన్లో తనకు కేటాయించిన కార్యక్రమాలను పూర్తి చేశానని, అనంతరం అమెరికా వెళ్లాల్సి ఉండగా అనుమతి రాకపోవడంతో తిరుగు ప్రయాణం చేసినట్లు వెల్లడించారు.


